India: పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ప్రసంగించిన రాష్ట్రపతి కోవింద్!

  • గాంధీ 150వ జయంతిని జరుపుకోబోతున్నాం
  • అమరులకు నివాళులు అర్పిస్తున్నాను
  • ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకూ ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా సమావేశమైన ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..‘2019 సంవత్సరం మన దేశ చరిత్రలో చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ ఏడాదే మనం మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను జరుపుకుంటున్నాం. ఇదే ఏడాది ఏప్రిల్ 13న పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ దురాగతం జరిగి వందేళ్లు పూర్తి అవుతాయి. మనందరి ఉజ్వల భవిష్యత్ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరులందరికీ నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’ అని తెలిపారు.

మా ప్రభుత్వం వచ్చాక సుస్థిరత..
‘శాంతిని ప్రబోధించిన సిక్కుల మతగురువు గురునానక్ 550వ జయంతిని మనం ఈ ఏడాదే జరుపుకుంటున్నాం. గాంధీజీ కలలు కన్నదిశగా భారత్ పురోగమిస్తోంది, బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువల ఆధారంగా ముందుకు సాగుతోంది. గౌరవనీయులైన సభ్యుల్లారా.. 2014 ఎన్నికలకు ముందు దేశంలో అనిశ్చితి కొనసాగేది. కానీ నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా దేశ ప్రజల కష్టాలను దూరం చేసేందుకు ప్రయత్నించింది. కట్టెల పొయ్యిలో వంట వండుతూ ఇబ్బంది పడే తల్లి, మరుగుదొడ్లు లేక చీకటి పడేవరకూ ఇంట్లోనే ఉండిపోయే సోదరి, విద్యుత్ లేక ఇబ్బంది పడే పిల్లాడు, మౌలిక వసతులు లేక నష్టపోయే రైతులు.. వీరందరూ నా ప్రభుత్వానికి లక్ష్యాలను నిర్దేశించారు. వీరిని దృష్టిలో పెట్టుకునే పలు పథకాలను రూపొందించాం’ అని కోవింద్ అన్నారు.

నాలుగేళ్లలో 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు..
‘నా ప్రభుత్వం సామాన్యుల బాధను అర్ధం చేసుకుంది. ప్రజల ఆరోగ్యం, చదువు, పారిశుద్ధ్యం సహా ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి భారత్ ను పరిశుభ్రంగా మార్చేందుకు కృషి చేయాలి. ఇన్నేళ్లలో 12 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే, ఎన్టీయే ప్రభుత్వం నాలుగేళ్లలోనే ఏకంగా 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం కోసం ఉచితంగా వైద్యం అందించేందుకు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చాం. వీటి ద్వారా ఏటా రూ.5 లక్షల బీమా లభిస్తుంది. దాదాపు 10 లక్షల మంది పేదలు ఈ పథకం చికిత్స పొందారు’ అని పేర్కొన్నారు.

India
President Of India
Ram Nath Kovind
parliament
  • Loading...

More Telugu News