america: అధికారుల కొత్త వల: అమెరికాలో నకిలీ యూనివర్సిటీ.. తప్పుడు ఇమ్మిగ్రేషన్ పత్రాలు పొందిన తెలుగు విద్యార్థుల అరెస్ట్!
- యూనివర్సిటీ ఆఫ్ పర్మింగ్టన్‌లో వెలుగులోకి
- వల పన్నేందుకు హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులే వర్శిటీ ఏర్పాటు
- ఎనిమిది మంది అధికారులు అరెస్టు
నకిలీ ఇమ్మిగ్రేషన్ సర్టిఫికెట్లతో అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్న విదేశీయులను అడ్డుకునేందుకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఓ వల పన్నారు. తామే ఒక ఫేక్ యూనివర్సిటీని సృష్టించారు. అందులో తమ అధికారులనే కొందరు ఉద్యోగులుగా చేర్పించారు. అనంతరం జరుగుతున్న తతంగాన్ని నిశితంగా గమనించారు.
తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా అడ్మిషన్ పొందిన తెలుగు విద్యార్థులను, వారికి సహకరించిన వర్శిటీ సిబ్బందిని అరెస్టు చేశారు. ఆ వివరాలలోకి వెళితే, మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ పరిసరాల్లోని పర్మింగ్టన్ హిల్స్‌లోని ఓ యూనివర్సిటీ ఉంది. దీన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులే తమ వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేశారు. 2015లో ఏర్పాటైన ఈ వర్శిటీలో 2017 నుంచి అధికారులు మారువేషాల్లో ఉద్యోగులుగా చేరారు. ఇమిగ్రేషన్ అక్రమాలు చేస్తున్న వాళ్లకోసం వలపన్నారు.
అక్రమంగా సర్టిఫికెట్లు పొంది నివసిస్తున్నారన్న ఆరోపణలపై అక్కడి అధికారులు 200 మంది తెలుగు వారిని అరెస్టు చేశారు. మొత్తం 600 మందిని అరెస్టు చేయగా అందులో 200 మంది తెలుగువారున్నారు. ఈ వ్యవహారం అక్కడి అమెరికన్ భారతీయుల్లో కలకలానికి కారణమయ్యింది. ప్రస్తుతం డెట్రాయిట్ పోలీస్ స్టేషన్‌లో 14 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
మొత్తంగా ఎంత మంది అరెస్టయ్యారో తెలియాల్సి ఉంది. లాయర్లను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో వీరంతా సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. నకిలీ పత్రాలను అందించేందుకు ఎనిమిది మంది తెలుగు వాళ్లు వీరికి సహకరించినట్టు సమాచారం. దీంతో బాధ్యులైన ఈ ఎనిమిది మంది సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. సరైన ఫ్యాకల్టీ కూడా లేని ఈ వర్సిటీలో పలువురు తెలుగు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇదో దురదృష్టకర ఘటన అని, ఇలా జరిగి ఉండాల్సింది కాదని భారతీయ అమెరికన్లు వ్యాఖ్యానించారు.
అరెస్టయిన తెలుగు విద్యార్థులలో కొందరి వివరాలివి..
భరత్ కాకిరెడ్డి(29), లేక్ మేరీ, ఫ్లొరిడా; అశ్వంత్ నూనె(26), అట్లాంటా; సురేష్ రెడ్డి కందాల(31), వర్జీనియా; ఫనిదీప్ కర్నాటి(35), కెంచుకీ; ప్రేమ్ కుమార్ రాంపీస(26), నార్త్ కెరొలీనా; సంతోష్ రెడ్డి సామ(28), కాలిఫోర్నియా; అవినాష్ తక్కళ్లపల్లి(28), పెన్సిల్‌వేనియా; నవీన్ ప్రత్తిపాటి(29), డల్లాస్ ఉన్నారు.