Chandrababu: దొడ్డి దారిలో వస్తున్నారు.. అందుకే సీబీఐకి అనుమతివ్వలేదు: చంద్రబాబు
- దెబ్బతీసేందుకే కన్నాతో కేసు వేయించారు
- స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పకుండా కేసులు
- నేను చేయాల్సిందంతా చేశా
- రైల్వే జోన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు
హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారని.. తనను దెబ్బతీసేందుకే అలా చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు అమరావతిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దొడ్డి దారిలో వస్తున్నారని.. అందుకే సీబీఐకి అనుమతివ్వలేదని అన్నారు. ఎవరైనా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పకుండా కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈడీని ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టడానికి సైతం సిద్ధమయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను చేయాల్సినదంతా చేస్తున్నానని.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇప్పటికి రెండు సార్లు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించామని అన్నారు. లాభాలొచ్చే పోర్టులు మాత్రమే కేంద్రం కావాలంటోందని.. మహారాష్ట్రకు భారీగా కరవు నిధులిచ్చి ఏపీని చిన్నచూపు చూశారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా, ఉద్యోగ సంఘాలన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేశాయన్నారు.
విశాఖ రైల్వే జోన్ ఇచ్చే పరిస్థితి లేదని.. ఒడిశా తమకు అభ్యంతరం లేదని చెప్పినా రైల్వే జోన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. హోదా సహా చట్టంలో అంశాల అమలుకు విశ్వ ప్రయత్నాలు చేశామని.. లోటు బడ్జెట్‌లో భర్తీ చేయాల్సిన మొత్తం కూడా ఇంత వరకూ సరిగా ఇవ్వలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.