sarfraj ahmedh: షోయబ్ అఖ్తర్ వ్యక్తిగతంగా నాపై దాడి చేస్తున్నాడు: పాక్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్

  • దక్షిణాఫ్రికా క్రికెటర్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సర్ఫరాజ్
  • నాలుగు మ్యాచ్ ల సస్పెన్షన్ విధించిన ఐసీసీ
  • బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన షోయబ్ అఖ్తర్

దక్షిణాఫ్రికా క్రికెటర్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, నాలుగు మ్యాచ్ ల సస్పెన్షన్ కు పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండిలే పెహ్లుక్వాయోకు సర్ఫరాజ్ క్షమాపణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ సర్ఫరాజ్ పై విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది.

పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ కూడా సర్ఫరాజ్ పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. నాలుగు మ్యాచ్ ల సస్పెన్షన్ తొందరలోనే అయిపోతుందని ఆయన అన్నాడు. కానీ, పాకిస్థాన్ ఇలాంటి జాతి వివక్ష వ్యాఖ్యలను సమర్థించదని చెప్పాడు. ఆట జరుగుతున్న సమయంలో అప్పటి పరిస్థితులను బట్టి సర్ఫరాజ్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని... ఏదేమైనప్పటికీ ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

ఈ నేపథ్యంలో, అఖ్తర్ వ్యాఖ్యలపై సర్ఫరాజ్ స్పందించాడు. అఖ్తర్ తనను కేవలం విమర్శించడం లేదని... నేరుగా తనపై దాడి చేస్తున్నాడని మండిపడ్డాడు. తప్పు చేశాననే విషయాన్ని తాను ఇప్పటికే అంగీకరించానని చెప్పాడు. ఈ వివాదం సమసిపోయేందుకు పాక్ క్రికెట్ బోర్డు చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నాడు. కష్టకాలంలో తనకు అండగా ఉన్నవారికి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నాడు. 

  • Loading...

More Telugu News