Nalgonda District: గెలిచాక అక్రమంగా ఆర్జిస్తే మీరే తీసుకోండి: బాండ్ పేపర్ పై సర్పంచ్ అభ్యర్థి భర్త హామీ
- వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై హామీ
- అలాగే ఓట్లు కొనే స్తోమత కూడా లేదని స్పష్టీకరణ
- భార్యను గెలిపించాలంటూ వినూత్నంగా ప్రచారం
రాజకీయాలంటే అవినీతి, అక్రమార్జనకు రాచమార్గమన్న అభిప్రాయం జనంలో పేరుకుపోయింది. దీన్నే తన ఎన్నికల ఆయుధంగా మార్చుకున్నాడు ఓ సర్పంచ్ అభ్యర్థి భర్త. తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం పంచాయతీని జనరల్ స్థానానికి కేటాయించారు. ఈ స్థానం నుంచి భార్య రమణమ్మను పోటీ చేయిస్తున్న చిలుముల రామస్వామి వినూత్న ప్రచారానికి తెరదీశాడు.
వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై ‘గ్రామ సర్పంచ్‌గా నా భార్యను ఎన్నుకుంటే నేనుగాని, నా కుటుంబ సభ్యులం గాని పనులు చేయడానికి ప్రజల వద్ద చేయిచాచం. తప్పుడు లెక్కలు చూపి వెనకేసుకోం. ప్రజా సేవకే పరిమితం అవుతాం. ఇప్పుడున్న ఆస్తులకు ఒక్క రూపాయి కూడా అదనంగా అక్రమంగా కూడేసుకోం. ఒకవేళ అలా కూడేసుకుంటే పంచాయతీ వాటిని జప్తు చేసి గ్రామ ప్రజలకు పంచవచ్చు’ అంటూ పేర్కొన్నాడు.
ఈ బాండ్ పేపర్‌పై దంపతులు ఇద్దరూ సంతకం చేశారు. అదే సమయంలో ఓట్లు కొనుగోలు చేసేందుకు తనవద్ద డబ్బులేదని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనని, తన నిజాయతీ చూసి ఓటేయాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. రమణమ్మ అభ్యర్థిత్వాన్ని ఇక్కడ సీపీఎం బలపరుస్తోంది.