steel: స్టీల్ తయారీలో జపాన్ ను వెనక్కు నెట్టేసిన భారత్!
- 2018లో106.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి
- అగ్రస్థానంలో కొనసాగుతున్న డ్రాగన్
- నాలుగో స్థానంతో సరిపుచ్చుకున్న అమెరికా
ఇప్పటికే పలు రంగాల్లో దూసుకుపోతున్న భారత్ మరో రికార్డును సాధించింది. తాజాగా ఉక్కు ఉత్పత్తిలో ఆసియా దిగ్గజం జపాన్ ను వెనక్కు నెట్టేసి రెండో స్థానానికి చేరుకుంది. 2017లో భారత్ 101.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగగా, 2018లో 106.5 మిలియన్ టన్నులు తయారైనట్లు వరల్డ్ స్టీల్ అసోసియేషన్ తెలిపింది.
ఇదే సమయంలో జపాన్ స్టీల్ ఉత్పత్తి 104.3 మిలియన్ టన్నులకు పడిపోయినట్లు పేర్కొంది. ఉక్కు ఉత్పత్తిలో డ్రాగన్ దేశం చైనా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 2018లో చైనా 928.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో చైనా వాటా 2017లో 50.3 నుంచి 51.3 శాతానికి పెరిగిందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నివేదిక తెలిపింది.
2018లో 86.7 మిలియన్ టన్నుల ముడి ఉక్కును తయారుచేసిన అమెరికా ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఇక టాప్ టెన్ జాబితాలో దక్షిణ కొరియా, రష్యా, జర్మనీ, టర్కీ, బ్రెజిల్, ఇరాన్‌లు చోటు దక్కించుకున్నాయి.