paruchuri: అన్నగారు నన్ను పిలిపించి మరీ ఆ మాట చెప్పారు: పరుచూరి గోపాలకృష్ణ
- సెట్లో అన్నగారు నన్ను గమనించారు
- మరునాడు స్టూడియోకి పిలిపించారు
- వ్యసనాల జోలికి వెళ్లొద్దని చెప్పారు
ఎన్టీఆర్ చేసిన ఎన్నో సినిమాలకి పరుచూరి బ్రదర్స్ కథ .. సంభాషణలు సమకూర్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీతో వాళ్ల అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు.
"ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు .. తరువాత కలుపుకుని 16 సంవత్సరాలపాటు ఆయనతో కలిసి ప్రయాణం చేశాము. ఆయన పార్టీ ఎనౌన్స్ చేయడానికి ముందురోజు కూడా ఆయనతోనే వున్నాము. ఆయనతో గడిపిన రోజుల్లోకి వెళితే .. 'అనురాగదేవత' షూటింగ్ జరుగుతూ ఉండగా నేను సెట్లోనే వున్నాను. షాట్ .. షాట్ కి మధ్యలో ఒక లేడీ ఆర్టిస్ట్ తో నేను మాట్లాడుతుండటం ఎన్టీఆర్ చూసి రమ్మన్నారు.
నేను ఆయన దగ్గరికి వెళ్లగానే 'ఇక్కడ వీరితో పనైపోయిందా?' అని డైరెక్టర్ తాతినేని రామారావును అడిగారు. 'అయిపోయిందండి' అన్నారాయన. అయితే మీరు 'అశోక' హోటల్ కి వెళ్లండి' అని నాతో అన్నారు పెద్దాయన. సెట్లో అలా కబుర్లు చెప్పకూడదేమోనని నాకు భయం వేసింది. హోటల్ కి వెళ్లి పడుకున్నాను. అన్నగారు స్టూడియోకి రమ్మన్నారంటూ ఉదయాన్నే కాల్ రావడంతో వెళ్లాను. ఆయనకి నమస్కరించగానే కూర్చోమన్నారు.
"తమ్ముడు చెప్పాడు .. మీరు వైస్ ప్రిన్సిపాల్ గా చేస్తూ ఇండస్ట్రీకి వచ్చారని. చాలా మంచి జీవితాన్ని వదులుకుని మీరు ఇక్కడికి వచ్చారు. సినిమా అనేది రంగుల ప్రపంచం. ఏ రంగు ఎప్పుడు వెలిసిపోతుందో ఎవరికీ తెలియదు. కానీ కొత్త కొత్త రంగులను మనకి అంటగడుతూ ఉంటుంది. ఇక్కడికి రాగానే వ్యసనాల బారిన పడతారు. అలా కాకుండా డబ్బును దాచుకుని ఆస్తులు కొనుక్కోవాలి" అని చెప్పారు.
వ్యసనాలకు బానిసలై మంచి జీవితాన్ని కోల్పోయిన కొంతమంది పేర్లు గుర్తుచేశారు. మందు .. పేకాట .. గుర్రప్పందాలు .. అమ్మాయిల జోలికి వెళ్లవద్దని చెప్పారు. నాకు అలాంటి అలవాట్లు లేవండీ అంటే ..'ఇకముందు కాకూడదు కదా' అన్నారు అంటూ చెప్పుకొచ్చారు.