Andhra Pradesh: ఆంధ్రా ప్రజలను రాక్షసులు అన్నందుకేనా కేసీఆర్ తో కలిసి నడుస్తున్నారు?: వైకాపాపై నారా లోకేశ్ విసుర్లు
- విభజన తరువాత రాష్ట్రానికి అన్యాయం
- కలిసి పోరాడాల్సిన సమయంలో ఎదురుదాడా?
- అభివృద్ధిని అడ్డుకోవడమే వైకాపా పని: లోకేశ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించిన ఏపీ మంత్రి నారా లోకేశ్, విభజన హామీలపై కేంద్రం చేస్తున్న అన్యాయంపై కలిసి పోరాడాల్సిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నవ్యాంధ్రలో అభివృద్ధిని అడ్డుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని నిప్పులు చెరిగిన ఆయన, ఏ ఎజెండాతో టీఆర్‌ఎస్ తో కలిసి నడుస్తున్నారని ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రజలను కేసీఆర్ రాక్షసులు అన్న విషయాన్ని మరచిపోయారా? లేక తెలంగాణాలో 35 ఉపకులాలను బీసీల జాబితా నుంచి తొలగించినందుకా? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏర్పాటు చేసినట్టు చెప్పుకుంటున్న కూటమిలో టీఆర్‌ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్ప మరే పార్టీలూ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీ సర్కారు అవినీతికి పాల్పడుతోందని పదేపదే చెబుతున్న బీజేపీ నేతలు, వారి వద్ద ఏమైనా సాక్ష్యాలుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.