cbi: సీబీఐలో మరో లొల్లి... తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టులో పిటిషన్
- తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుపై సీబీఐ ఎస్పీ బాలాజీ పిటిషన్
- తన పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణ
- చెన్నైలో ఉండగానే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమైనట్టు సమాచారం
సీబీఐలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదాలకు అడ్డుకట్ట పడే సూచనలు కూడా కనిపించడం లేదు. తాజాగా సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావుపై సీబీఐ ఎస్పీ రాజా బాలాజీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగేశ్వరరావు తనను టార్గెట్ చేస్తున్నారని... పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో ఆరోపించారు.
వివాదం వివరాల్లోకి వెళ్తే, రాజా బాలాజీ సీబీఐ యాంటీ కరప్షన్ బ్రాంచ్ లో విధులను నిర్వర్తిస్తుండేవారు. గత ఏడాది ఇంటెలిజెన్స్ సేవలకు గాను పతకం కూడా పొందారు. జనవరి 20న 20 మంది అధికారులను నాగేశ్వరరావు బదిలీ చేశారు. వీరిలో బాలాజీ కూడా ఉన్నారు. ఆయనను సీబీఐ అకాడమీకి పంపించారు. ఈ వ్యవహారంపైనే బాలాజీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. మరోవైపు, చెన్నైలో ఉండగానే వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమైనట్టు సమాచారం. అప్పట్లో నాగేశ్వరరావు కింద బాలాజీ పని చేస్తుండేవారు. బాలాజీకి ప్రమోషన్ రావడంతో, తనతో సమానమవుతున్నారనే భావనతో ఆయనను నాగేశ్వరరావు టార్గెట్ చేసినట్టు సమాచారం.