India: ముస్లిం మహిళ వెనుక పరిగెత్తడం తప్ప నువ్వు ఏం సాధించావ్!: కేంద్ర మంత్రి హెగ్డే నోటి దురుసు
- కర్ణాటక పీసీసీ చీఫ్ పై ట్విట్టర్ లో మండిపాటు
- భార్య మతాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు
- పదవి నుంచి తప్పించాలని రాహుల్ డిమాండ్
కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనంత్ కుమార్ హెగ్డే వివాదంలో చిక్కుకున్నారు. గతంలో చేసిన ఓ అభ్యంతరకరమైన కామెంట్ ను సమర్థించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ నేత గుండూరావ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు కేంద్ర మంత్రిపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మించలేదనీ, అది మందిరమని నిన్న నోటికి పనిచెప్పిన హెగ్డే ఈరోజు మరోసారి రెచ్చిపోయారు. కర్ణాటకలోని కొడగు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. హిందూ మహిళలను ఎవరి చెయ్యి అయినా తాకితే అది ఇక ఉండకూడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీంతో కర్ణాటక పీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావు స్పందిస్తూ.. ‘మీరు కేంద్ర మంత్రి అయ్యింది ఇందుకేనా? కర్ణాటక అభివృద్ధికి మీరు ఏం చేశారు? మంత్రి బాధ్యతలు స్వీకరించాక ఏం సాధించారు? నిజంగా ఓ కేంద్ర మంత్రి నుంచి ఇలాంటి మాటలు వినాల్సి రావడం సిగ్గుచేటు. ఇలాంటి వ్యక్తులు మంత్రులుగా, పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవడం నిజంగానే బాధాకరం’ అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ తో ఆగ్రహానికి లోనయిన హెగ్డే వెంటనే బదులిస్తూ..‘నేను దినేశ్ గుండూరావ్ ప్రశ్నలకు తప్పకుండా సమాధానం ఇస్తా. కానీ ముందుగా గుండూరావ్ ఎవరితో కలిసి ఏం విజయాలు సాధించారో చెప్పాలి. నాకు తెలిసినంతవరకూ ఆయన ఓ ముస్లిం మహిళ వెనుక పరుగెత్తిన వ్యక్తి మాత్రమే’ అని తీవ్రంగా విరుచుపడ్డారు.
దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు నెటిజన్లు మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి మంత్రిగా ఉండటం ప్రతీ భారతీయుడికి సిగ్గుచేటనీ, హెగ్డేను వెంటనే కేంద్ర మంత్రి బాధ్యతల నుంచి తప్పించాలని రాహుల్ డిమాండ్ చేశారు. బ్రాహ్మణుడైన గుండూరావ్ టబు అనే ముస్లిం మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.