Andhra Pradesh: ప్రకాశం జిల్లాపై వైసీపీ కొత్త ఆలోచన.. లోక్ సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ?
- వైసీపీ అధినేతకు ప్రశాంత్ కిశోర్ సూచన
- ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ
- వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చే ఛాన్స్
ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలపై వైసీపీ కన్నేసిందా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసేందుకు యత్నిస్తోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జగన్ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం రాష్ట్రమంతటా పర్యటించింది. వైసీపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి ఈ సారి వైవీ సుబ్బారెడ్డిని కాకుండా వైఎస్ షర్మిలను పోటీకి దించాలని ప్రతిపాదించింది.
ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పార్టీ గ్రూపులుగా విడిపోయిందని ప్రశాంత్ కిశోర్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వైవీ సుబ్బారెడ్డి కారణంగానే జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయని పలువురు వైసీపీ కార్యకర్తలు ఈ టీమ్ కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి స్థానంలో షర్మిలను దించితే పార్టీకి లబ్ధి చేకూరుతుందని జగన్ కు కిశోర్ సూచించారు.
దీనివల్ల అందరు నేతలు కలిసి పనిచేస్తారనీ, తద్వారా గిద్దలూరు, మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం,కనిగిరి, ఒంగోలుతో పాటు మెజారిటీ సీట్లను దక్కించుకోవచ్చని చెప్పారు. ఒకవేళ షర్మిలను దించకుంటే అంతర్గత పోరు కారణంగా పార్టీ నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. షర్మిలను ఒంగోలు నుంచి పోటీకి దించి వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చే అంశాన్ని జగన్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్తు తెలుస్తోంది.