raghurami reddy: షూట్ చేస్తానంటావా? ఎంతమందిని షూట్ చేస్తావురా?: సీఐతో వైసీపీ ఎమ్మెల్యే వాగ్వాదం
- పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబీకులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
- కొందరు వైసీపీ అనుచరులను స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు
- సీఐతో వాగ్వాదానికి దిగిన మైదుకూరు ఎమ్మెల్యే
కడప జిల్లా మైదుకూరు పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన అనుచరులను అదుపులోకి తీసుకుని, కొట్టారంటూ కొంతమందితో కలసి మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడ సెల్ లో ఉన్న తన అనుచరుల వద్దకు దూసుకెళ్లారు.
ఈ సందర్భంగా రఘురామిరెడ్డిని సీఐ జీఆర్ యాదవ్ అడ్డుకున్నారు. దీంతో, వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బయటకు వెళ్లాలంటూ సీఐ, పోలీసులు వారిని బయటకు పంపారు. దీంతో, 'మమ్మల్నే బయటకు వెళ్లమంటావా... షూట్ చేస్తానంటావా... ఎంతమందిని షూట్ చేస్తావురా' అంటూ తన అనుచరులతో కలసి స్టేషన్ బయట బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, తిరిగి తన న్యాయవాదితో కలసి సీఐ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే చర్చించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన నిన్న చోటుచేసుకుంది.
కేసు వివరాల్లోకి వెళ్తే, టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి, టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబసభ్యులపై వైసీపీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేశారు. దీంతో, మైదుకూరు పీఎస్ లో వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, కొంతమందిని పీఎస్ కు తీసుకొచ్చి, విచారించారు.
ఘటన అనంతరం మీడియాతో సీఐ మాట్లాడుతూ, తన అనుమతి లేకుండానే సుమారు 30, 40 మందితో నిందితుల వద్దకు ఎమ్మెల్యే వెళ్లారని... దౌర్జన్యంగా సెల్ వద్దకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అని గౌరవం ఇచ్చినా... ఆయన వినలేదని చెప్పారు. దీంతో, అందరినీ బయటకు పంపించాల్సి వచ్చిందని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చానని చెప్పారు.