Team India: కివీస్‌ను ఆదుకున్న టేలర్.. భారత్ విజయ లక్ష్యం 244
- ఒంటరి పోరాటం చేసిన టేలర్
- ఏడు పరుగుల తేడాతో సెంచరీ మిస్
- మూడు వికెట్లు పడగొట్టిన షమీ
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటై భారత్ ముందు ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ పది పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరో 16 పరుగులు జోడించాక మరో వికెట్ పడింది. ఆరు ఓవర్లకే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను కెప్టెన్ కేన్ విలియమ్సన్ (28) రాస్ టేలర్‌లు ఆదుకున్నారు. వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే, 59 పరుగుల స్కోరు వద్ద కెప్టెన్ అవుట్ కావడంతో జట్టు భారాన్ని టేలర్ తన భుజాలపై వేసుకున్నాడు. వికెట్ కీపర్ టామ్ లాథమ్(51)తో కలిసి సంయమనంతో ఆడాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అడపా దడపా బంతిని బౌండరీలకు పంపిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. అయితే, 178 పరుగుల వద్ద లాథమ్ అవుటయ్యాక కివీస్ వికెట్ల పతనం మరోమారు ప్రారంభమైంది.
భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచారు. మరోవైపు టేలర్ ఒంటరి పోరాటం చేస్తూ జట్టు స్కోరు పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. ఫోర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తం 106 బంతులు ఎదుర్కొన్న టేలర్ 9 ఫోర్లతో 93 పరుగులు చేసి సెంచరీ ముంగిట అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు ఎక్కువ సేపు నిలవలేకపోయారు. దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే కివీస్ 243 పరుగులకు ఆలౌటై భారత్ ముందు 244 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, చాహల్, పాండ్యా రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు.