army recruitment rally: విద్యుదాఘాతంతో ఉద్యోగార్థి మృతి... ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో అపశ్రుతి
- వేలాడుతున్న వైర్లు తగలడంతో విషాదం
- మౌలాలీ రైల్వే శిక్షణ కార్యాలయం వద్ద ఘటన
- మృతుడిది వనపర్తి జిల్లా ఆత్మకూరు
ఉద్యోగాన్ని సాధించి జీవిత లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని వచ్చిన ఆ యువకుడిని విద్యుత్ తీగెల రూపంలో మృత్యువు కాటేసింది. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరైన ఓ ఉద్యోగార్థి విద్యుదాఘాతంతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని మౌలాలి ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో నేటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా పరుగు పందెం జరగాల్సి ఉంది. ఇందుకు ఎనిమిది రాష్ట్రాల నుంచి వేలాది మంది అభ్యర్థులు ఆదివారం అర్ధరాత్రికే మౌలాలి రైల్వే శిక్షణ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన అరవింద్ ఉన్నాడు. అంచనాలకు మించి అభ్యర్థులు రావడంతో వారిని నియంత్రించడం సాధ్యంకాక నిర్వాహక విభాగం అధికారులు చేతులెత్తేశారు. అవసరమైన కనీస సదుపాయాలు కూడా చేపట్టలేదు. దీంతో చెట్టుకొకరు పుట్టకొకరులా అభ్యర్థులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమైపోయారు.
ఈ క్రమంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లను గమనించని అరవింద్ వాటికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు రోజుల నుంచి నగరంలో వర్షం కురుస్తోందని, ఇంత పెద్ద రిక్రూట్మెంట్లో అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని అభ్యర్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషాద ఘటన జరగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.