Brazil: బ్రెజిల్ ఆనకట్ట ప్రమాదం: మృతులు భారీగానే ఉండొచ్చని అనుమానం!
- శుక్రవారం కూలిన 40 ఏళ్ల నాటి వంతెన
- 192 మందిని రక్షించిన అధికారులు
- ప్రమాదకరంగా మరో ఆనకట్ట
బ్రెజిల్‌లో మూడు రోజుల క్రితం ఆనకట్ట కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య వందల్లోనే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 34 మంది మాత్రమే చనిపోయారని చెబుతున్నా, నిజానికి ఆ సంఖ్య వందల్లోనే ఉంటుందని అంటున్నారు. బ్రుమాడినో నగరంలో శుక్రవారం ఆనకట్ట ఒక్కసారిగా కూలిపోయింది. నీరు, బురద సమీప గ్రామాలను ముంచెత్తింది. దీంతో చాలా వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారని, మరో 200 మంది గల్లంతయ్యారని తొలుత వార్తలు వచ్చాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఇజ్రాయెల్ ఆర్మీ, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. హెలికాప్టర్ల సాయంతో బురదలో చిక్కుకున్న వారిని రక్షించారు. ఇప్పటి వరకు 192 మందిని రక్షించారు. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆనకట్ట కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు, బ్రుమాడినోలో ఆగకుండా కురుస్తున్న వర్షం, బురద వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా, బ్రుమాడినోకు సమీపంలో కొర్రేగో డి ఫెయిజియో గనుల వద్ద ‘వలే’ కంపెనీకి చెందిన మరో ఆనకట్టలో కూడా నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో సమీప గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.