KCR: కేసీఆర్ గురించి పవన్‌కు ఫుల్ క్లారిటీ ఉంది.. ఆయన ఉచ్చులో పడకపోవచ్చు: విజయశాంతి
- అమరావతి వెళ్లి జగన్‌ను కలుస్తానన్నారు
- హైదరాబాద్‌లో పవన్‌ను కలిశారు
- జగన్-పవన్‌కు కలపడమే కేసీఆర్ అజెండా
కేసీఆర్ గురించి పవన్‌కు ఫుల్ క్లారిటీ ఉందని, కాబట్టి ఆయన ఉచ్చులో జనసేనాని పవన్ పడకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రధాన రాజకీయ పార్టీలకు సమదూరం పాటిస్తున్నారని అన్నారు. అటువంటి పవన్‌ను ఏదో రకంగా వివాదాల్లోకి లాగాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి-అఖిలేశ్ యాదవ్ కలవగా లేనిది పవన్-చంద్రబాబు కలిస్తే తప్పేంటని టీడీపీ నేతలు అంటున్నారని విజయశాంతి పేర్కొన్నారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్ హోంలో కేసీఆర్-పవన్ మంతనాలు జరిపి మరింత గందరగోళానికి తెరతీశారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం ఏపీకి వెళ్లి జగన్‌తో చర్చిస్తానన్న కేసీఆర్ అంతకంటే ముందే పవన్‌తో మంతనాలు జరిపి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్సేతర ఫ్రంట్‌లు ఏర్పాటు చేయడం కంటే వైసీపీ-జనసేనలను ఒకవేదిక మీదకు తీసుకు రావడాన్నే ఆయన అజెండాగా పెట్టుకున్నారన్న అనుమానం వస్తోందన్నారు.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యాన్ని వద్దనుకున్న కేసీఆర్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, అటువంటి కేసీఆర్ గురించి, టీఆర్ఎస్ జిత్తుల గురించి పవన్‌కు బాగానే క్లారిటీ ఉండి ఉంటుందని అన్నారు. కాబట్టి పవన్ అంత త్వరగా కేసీఆర్ ఉచ్చులో పడకపోవచ్చని విజయశాంతి పేర్కొన్నారు.