Chandrababu: చంద్రబాబును మరోసారి సీఎం చేసి.. మన కోరికలను నెరవేర్చుకుందాం: యనమల
- బీసీలను తొలుత గుర్తించింది ఎన్టీఆరే
- బీసీల భవిష్యత్తు కోసం చంద్రబాబు ఎంతో చేస్తున్నారు
- బీసీల కోసం ప్రభుత్వం రూ. 43 వేల కోట్లను ఖర్చు చేస్తోంది
బీసీలను తొలుత గుర్తించింది దివంగత ఎన్టీఆర్ అని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 1983కు ముందు బీసీలకు రాజకీయ, ఆర్థిక సాయం ఉండేది కాదని... 1982లో టీడీపీని ఎన్టీఆర్ స్థాపించిన తర్వాత బీసీలకు అవకాశాలు వచ్చాయని చెప్పారు. బీసీల కోసం టీడీపీ ప్రభుత్వం రూ. 43 వేల కోట్లను ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 144 బీసీ కులాలను విడదీయడానికి కొన్ని శక్తులు పని చేస్తున్నాయని, వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
బీసీలంతా ఐకమత్యంగా ఉండాలని, టీడీపీకి అండగా నిలవాలని కోరారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి, కేంద్రానికి పంపామని చెప్పారు. బీసీల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి, మన కోరికలను నెరవేర్చుకుందామని చెప్పారు. రాజమండ్రిలో జరుగుతున్న జయహో బీసీ సభలో మాట్లాడుతూ, యనమల పైమేరకు వ్యాఖ్యానించారు.