philippains: ఫిలిప్పీన్స్‌లో చెలరేగిన ఉగ్రమూకలు... దాడుల్లో 19 మంది మృతి
- యాభై మందికి పైగా గాయాలు
- జోలో ప్రాంతంలోని కాథడ్రల్ చర్చి సమీపంలో బాంబు పేలుడు
- అనంతరం చర్చి ఆవరణలోనే బ్లాస్ట్
దక్షిణ ఫిలిప్సీన్స్‌లో ఉగ్ర మూకలు చెలరేగిపోయాయి. భారీ పేలుళ్లకు పాల్పడ్డారు. ముస్లిం మిలిటెంట్ల ప్రభావం అధికంగా ఉండే జోలో ప్రాంతంలోని కాథడ్రిల్ చర్చి ఆవరణలో జరిగిన పేలుడు ఘటనలో 19 మంది దుర్మరణం పాలవ్వగా 50 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.
ముష్కరులు తొలుత చర్చికి సమీపంలోని ప్రాంతంలో ఓ పేలుడుకు పాల్పడ్డారు. స్థానికంగా కలకలం రేగడంతో, ఏమైందో తెలుసుకునేలోగానే చర్చి ఆవరణలో మరో పేలుడుకు పాల్పడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి ఆ ప్రాంతం భీతావహంగా మారింది. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉండడంతో హెలికాప్టర్‌లో హుటాహుటిన జాంబోంగా నగరానికి తరలించారు.
ఈ ఘటనపై ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి డెల్ఫిన్ లోరెన్జవా స్పందిస్తూ తక్షణం అన్ని ప్రాంతాల్లో భద్రత పెంచాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆజ్ఞలు జారీ చేశారు. జోలో ద్వీపంలో అబు సయ్యఫ్ సంస్థ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సంస్థను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. గత కొంతకాలంగా ఈ ఉగ్ర సంస్థ ఈ ప్రాంతంలో బాంబుపేలుళ్లు, కిడ్నాప్‌లు, శిరచ్ఛేదనకు పాల్పడుతూ భయాందోళనలకు గురిచేస్తోంది.