Andhra Pradesh: కోరిక తీర్చలేదన్న ఆగ్రహంతో.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు!

  • కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఘటన
  • బాధితురాలి పరిస్థితి విషమం
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు

తన కోరికను తీర్చాల్సిందిగా ఓ కామాంధుడు యువతిని వేధించడం మొదలుపెట్టాడు. అమ్మాయి ఛీకొట్టి, ఇంట్లో చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు అతనిని గట్టిగా హెచ్చరించారు. దీంతో ఇంట్లో యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి తన కోరిక తీర్చాలని మరోసారి వేధింపులకు దిగాడు. దీన్ని సదరు అమ్మాయి తీవ్రంగా ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని కౌతాలం మండలం బదినేహల్ గ్రామంలో ఓ యువతి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన మౌలాలీ అనే వ్యక్తి ఏడాది కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ తన కోరికను తీర్చాలని మౌలాలీ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని సదరు బాలిక తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మౌలాలీని హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. అయినా అతను వెనక్కి తగ్గలేదు.

నిన్న సాయంత్రం యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన మౌలాలీ లోపలకు వెళ్లి తలుపులు వేశాడు. తన కోరికను తీర్చాలని మరోసారి డిమాండ్ చేశాడు. అయితే యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ ఘటనతో సహనం కోల్పోయిన నిందితుడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. మంటలు చెలరేగడంతో బాధితురాలి ఆర్తనాదాలు విన్న ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు యువతి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు మౌలాలీ కోసం గాలిస్తున్నారు.

Andhra Pradesh
Kurnool District
sexual harrasment
Police
torched
immolation
flames
petrol
  • Loading...

More Telugu News