bharat ratna: ఇంత అన్యాయమా... భారతరత్న పొందిన సన్యాసి ఒక్కరూ లేరు!: రాందేవ్ బాబా
- 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఒక్కరికీ ఇవ్వక పోవడం విడ్డూరం
- దయానంద సరస్వతి, స్వామివివేకానంద లాంటి వారిని పట్టించుకోలేదు
- వచ్చే ఏడాదైనా పరిశీలించాలని కోరుతున్నా
కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారాల ప్రకటనపై ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు. '70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఒక్క సన్యాసికి కూడా భారత రత్న అందించలేదు ఎందుకని?' అని ప్రశ్నించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌లకు రెండురోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హరిద్వార్‌లో రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ మహారుషి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, శివకుమారస్వామి వంటి ప్రముఖులకు కూడా ఈ గౌరవం దక్కలేదన్నారు. వచ్చే ఏడాదైనా కేంద్రం సన్యాసుల పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవలే శివైక్యం పొందిన కర్ణాటక రాష్ట్రంలోని సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామికి భారతరత్న ఇవ్వాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర సహా పలువురు నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.