Andhra Pradesh: మాజీ క్రికెటర్ లక్ష్మణ్ ను మోసం చేసిన టెక్కీ.. మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు!
- తెలంగాణలోని హైదరాబాద్ లో ఘటన
- లక్ష్మణ్ ఈ-మెయిల్ ను హ్యాక్ చేసిన హక్
- సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన క్రికెటర్
మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను మోసం చేసిన కేసులో ఓ టెక్కీకి జైలు శిక్ష విదిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. లక్ష్మణ్ బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలు దొంగలించిన కేసులో కోల్ కతా కు చెందిన రెజ్బానుల్ హక్ కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.40,000 జరిమానా విధించింది. లక్ష్మణ్ కు హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో ఉన్న ధనలక్ష్మీ బ్యాంక్ బ్రాంచ్ లో అకౌంట్ ఉంది. తన ఖాతా నుంచి ఇతర అకౌంట్లకు నగదును బదిలీ చేయాలని లక్ష్మణ్ బ్రాంచ్ మేనేజర్ ను ఈ-మెయిల్ లో కోరేవారు. బ్యాంకు సిబ్బంది అలాగే చేసేవారు.
అయితే ఈ క్రమంలో లక్ష్మణ్ ఈ-మెయిల్ ను 2014లో హ్యాక్ చేసిన రెజ్బానుల్ హక్.. ఫలానా బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు పంపాలని మేనేజర్ కు ఈ-మెయిల్ పంపాడు. దీంతో బ్యాంక్ మేనేజర్, సిబ్బంది అందుకు అనుగుణంగా కోల్ కతాలోని ఓ బ్యాంకు ఖాతాకు ఈ మొత్తాన్ని బదిలీ చేశారు. డబ్బులు డ్రా అయినట్లు ఎస్ఎంఎస్ రావడంతో అప్రమత్తమైన లక్ష్మణ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఆయన ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసును విచారించిన కూకట్‌పల్లి 9వ అదనపు ఎంఎం న్యాయస్థానం హక్ ను దోషిగా తేల్చి శిక్ష విధించింది. మరోవైపు ఈ ఘటనలో హక్ కొట్టేసిన రూ.10 లక్షలను పోలీసులు రికవరీ చేయగలిగారు.