AP assembley: అత్యవసరమైతే తప్ప మరో సమావేశం లేకపోవచ్చు: అసెంబ్లీ స్పీకర్ కోడెల
- ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలు
- ఫిబ్రవరి 5న ఓటాన్ అకౌంట్ బడ్జెట్
- ముగియనున్న అసెంబ్లీ కాలపరిమితి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి శీతాకాల సమావేశాలే చివరివి అయ్యే అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప మరో సమావేశానికి అవకాశం లేకపోవచ్చునని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న తరుణంలో మరో సమావేశానికి సమయం ఉండక పోవచ్చునన్న ఉద్దేశంతో స్పీకర్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 30వ తేదీ నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవంలో భాగంగా అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని నేడు ఆవిష్కరించిన స్పీకర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. 30వ తేదీన గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయని, 31న సంతాప తీర్మానాలు ఉంటాయని చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు సెలవులని, మళ్లీ నాల్గో తేదీన తిరిగి సభ సమావేశమవుతుందని చెప్పారు.
ఆ రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుందన్నారు. ఐదో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారని, 6 నుంచి 8వ తేదీ వరకు బడ్జెట్‌పై ప్రసంగాలు ఉంటాయని వెల్లడించారు. దీంతో ఈ ఐదేళ్ల కాలపరిమితిలో నిర్వహించాల్సిన సమావేశాలు ముగిసినట్టవుతుందని తెలిపారు.