Air India: ఎయిరిండియా రిపబ్లిక్ డే ఆఫర్.. రూ.979కే టికెట్!

  • రూ. 55 వేలకే అమెరికా ప్రయాణం
  • రూ. 11 వేలకే ఆసియా దేశాలకు..
  • ఈ నెల 28 వరకు టికెట్ల విక్రయం

రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని విమానయాన సంస్థ ఎయిరిండియా జాతీయ, అంతర్జాతీయ ప్రయాణ టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. అన్ని పన్నులు కలుపుకుని ఎకానమీ క్లాస్ టికెట్‌ను రూ. 979 కనీస ధరకు విక్రయించనున్నట్టు తెలిపింది. నేటి నుంచి ఈ నెల 28 వరకు టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. కొనుగోలు చేసిన టికెట్లపై ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా ప్రయాణాలు చేసుకోవచ్చని వివరించింది. ఎయిరిండియా వెబ్‌సైట్, ఎయిర్‌లైన్, సిటీ బుకింగ్ కార్యాలయాలు, కాల్‌సెంటర్లు, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ‘మొదట వచ్చిన వారికి మొదట’ ప్రాతిపదికన టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది.

దేశీయంగా ఎకానమీ క్లాస్‌లో ఒకవైపు ప్రయాణానికి అన్ని పన్నులు కలుపుకుని రూ. 979కి ప్రారంభం కానుండగా, బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ. 6,965 వరకు ఉంటుందని ఎయిరిండియా పేర్కొంది.  అలాగే, అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఎకానమీ క్లాస్‌లో రూ. 55 వేలకే అమెరికాకు వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. యూకే, యూరప్ సెక్టార్లకు రూ. 32 వేలు, ఆస్ట్రేలియాకు ఎకానమీ క్లాస్‌లో రూ. 50 వేలకే టికెట్లు ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ ఆసియా ప్రాంతంలోని దేశాలకు రూ.11వేలకు టికెట్ల ధరలున్నాయని.. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని కోరారు.

Air India
flight
Republic Day
Offer
flight tickets
America
Europe
Australia
  • Loading...

More Telugu News