Andhra Pradesh: రాబోయే ఎన్నికల్లో టీడీపీ రూ.6,000 కోట్లు ఖర్చు పెట్టబోతోంది!: వైసీపీ నేత ఆనం సంచలన ఆరోపణ

  • జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
  • టీడీపీది ధనబలం అయితే జగన్ ది జనబలం
  • నంద్యాలలో రూ.200 కోట్లు ఖర్చుపెట్టారు

వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ రూ.6,000 కోట్లు ఖర్చు పెట్టబోతోందని ఆరోపించారు. అంటే ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.30-35 కోట్లను టీడీపీ నేతలు వ్యయం చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జగన్ ధనబలంతో గెలిచేందుకు యత్నిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ గెలవబోయేది ధనబలంతో కాదనీ, జనబలంతో మాత్రమేనని వ్యాఖ్యానించారు.

జనబలం జగన్ కు ఉంది కాబట్టే సుదీర్ఘంగా చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం అయిందని తెలిపారు. జగన్ ను ఏపీ ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ రూ.200 కోట్ల నిధులను నీటిలా పారించి గెలిచిందని విమర్శించారు. ఓట్లు ఎలా కొనుగోలు చేయాలి? ఎలా తొలగించాలి? అనే విషయంలో చంద్రబాబు, మంత్రి లోకేశ్ టీడీపీ శ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీవాళ్లు ఓటర్ల జాబితాలోనే ఉండకూడదు అని దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న విజయనగరంలో జరిగిన ఓటర్ల తొలగింపు కార్యక్రమం అంతకుముందు కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపురంలో జరిగిందన్నారు. లోకేశ్ నేతృత్వంలోని తెలుగుయువత నేతలు దీనిని నిర్వహిస్తున్నారన్నారు. "ట్యాబ్ లు తీసుకుని ప్రజల ఇళ్లకు వెళుతున్న ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు ఓటర్ జాబితాను దగ్గర పెట్టుకుని ‘మీరు ఏ పార్టీకి చెందినవారు? మీకు ఏ పథకాలు అందాయి? ఇంకా ఏ పథకాలు అమలు చేయాలి? అంటూ అడుగుతున్నారు. చివర్లో చంద్రబాబు అందంగా ఉన్నారా? లేక జగన్ మోహన్ రెడ్డి అందంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు జగనే అందంగా ఉన్నాడని చెబితే వారి ఓట్లను తొలగిస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
elections
6000 crore
YSRCP
Jagan
anam ramanarayana reddy
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News