Andhra Pradesh: ఏపీపీఎస్సీ ఆఫీసు ముందు విద్యార్థుల ఆందోళన.. గ్రూప్-1 పరీక్షను నిలిపివేయాలని డిమాండ్!
- చైర్మన్ ఉదయభాస్కర్ పై మండిపాటు
- రిజర్వేషన్లను అమలుచేయడం లేదని ఆరోపణ
- విద్యార్థులను సముదాయించిన పోలీసులు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కార్యాలయం దగ్గర ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ కు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాలు ఈరోజు ఆఫీసు ముందు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు ఉదయభాస్కర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉదయభాస్కర్ రిజర్వేషన్ల అమలులో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఇటీవల ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను రద్దు చేయాలనీ, పరీక్షను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాగా, అధికారుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థి నేతలతో చర్చలు జరుపుతున్నారు.