igroil: ఫలించిన వృద్ధురాలి ప్రయత్నం... ప్రధాని జోక్యంతో 30 ఏళ్ల పింఛన్‌ మొత్తం రూ.కోటి మంజూరు!

  • ప్రధాని మోదీ చొరవతో చర్యలు చేపట్టిన సైనిక విభాగం
  • ఇజ్రాయిల్‌ వాసి కల్నల్‌ జార్జి బెంజమిన్‌ భారత సైనిక దళంలో సేవలు
  • రిటైరయ్యాక సొంత దేశం వెళ్లడంతో నిలిచిపోయిన పెన్షన్‌

భారత సైనిక దళంలో తన భర్త అందించిన సేవలను గుర్తుచేస్తూ తనకు న్యాయబద్ధంగా రావాల్సిన పింఛన్‌ మొత్తాన్ని ఇప్పించాలని దివంగత మాజీ సైనికుడి భార్య ఒకరు 30 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. సమస్య నేరుగా ప్రధాని మోదీ దృష్టికి వెళ్లడంతో, ఆయన చొరవతో ఇన్నేళ్ల పింఛన్ మొత్తం దాదాపు రూ.కోటి మంజూరుకు అవసరమైన చర్యలను సైనిక అధికారులు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే...ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన కల్నల్‌ జార్జ్‌ బెంజమిన్‌ భారత్‌ ఆర్మీ ఇంజనీరింగ్‌ దళంలో సేవలందించారు. 1966లో పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన తన సొంత దేశం ఇజ్రాయిల్‌ వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయారు. జార్జి 1990లో మృతి చెందడంతో ఆయనకు ఇస్తున్న పెన్షన్‌ను భారత్ ప్రభుత్వం నిలిపివేసింది. పెన్షనర్‌ కుటుంబం విదేశాల్లో ఉంటోందన్న సాకుతో ఆపేశారు. దీనిపై జార్జ్‌ భార్య హెబే సంబంధిత అధికారులకు ఎన్ని ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేకపోయింది. ఇజ్రాయిల్‌లోని భారత దౌత్యకార్యాలయాన్ని సంప్రదించినా ఫలితం లేకపోయింది. చివరి ప్రయత్నంగా హెబే భారత్‌ ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌రావత్‌లకు లేఖలు రాశారు.

ఈ విషయం ప్రధాని దృష్టికి వెళ్లడంతో ప్రధాని కార్యాయం చొరవ తీసుకుంది. తక్షణం పింఛన్‌ మంజూరుకు చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో జార్జ్‌ పింఛన్‌ ఫైలుకు కదలిక వచ్చింది. నిలిచిపోయిన నాటి నుంచి జనవరి 31 వరకు చెల్లించాల్సిన పింఛన్‌ మొత్తం వడ్డీతో కలిపి రూ.కోటి అని తేల్చిన అధికారులు ఆ మొత్తం హెబేకు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని జార్జ్‌ బెంజమిన్‌ కుటుంబ స్నేహితుడు మన్‌క్రీత్‌ కాంత్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News