Rahul Gandhi: ఎన్నికల వేళ కుంభమేళా వేదికగా రాహుల్‌గాంధీ ‘హిందూ’ మంత్రం!
- పుష్కర స్నానం ఆచరించడం ద్వారా ఆకర్షించే యత్నం
- లక్షలాది మంది వీక్షిస్తుండగా చేస్తే హిందూమూలాలను వెల్లడించవచ్చన్న భావన
- అవసరమైన సన్నాహాలు చేస్తున్న పార్టీ వర్గాలు
‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అన్నది సామెత. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశంలో ఇదే సూత్రాన్ని ఆచరించి ఫలితం సాధించాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ యోచిస్తున్నారా? అంటే, అవుననే అంటున్నారు పరిశీలకులు. తన సోదరి ప్రియాంకను తెచ్చి ఉత్తరప్రదేశ్ తూర్పు బాధ్యతలు అప్పగించిన రాహుల్, హిందు కార్డుతోనే బీజేపీ హవాను నిలువరించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇందుకోసం ఫిబ్రవరిలో కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించి దానికి విస్తృత ప్రచారం కల్పించడం మంచి అవకాశంగా భావిస్తున్నారట. ఇందుకు అనుగుణంగా అవసరమైన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. లక్షలాది మంది వీక్షిస్తుండగా పుణ్యస్నానం ఆచరించడం ద్వారా హిందూ మూలాలను బలంగా ప్రజల్లోకి పంపవచ్చునని రాహుల్ భావిస్తున్నారు.
ఇందుకోసం జంద్యం, పసుపు పంచె, కండువా ధరించి గంగా జలాల్లో పుణ్యస్నానమాచరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ స్నానం చేస్తుండగా 12 మంది పండితులు వేద మంత్రాలను జపిస్తారని తెలిపారు. రాహుల్ జంద్యం ధరించే బ్రాహ్మణుడని కాంగ్రెస్ ప్రతినిధి సుర్జీవాలా గతంలో అన్న విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే రాజస్థాన్ ఎన్నికల్లో భాగంగా పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్ని సందర్శించిన రాహుల్ తాను బ్రాహ్మణుడనని, తమది దత్తాత్రేయ గోత్రమని వెల్లడించిన విషయం తెలిసిందే.