New Delhi: ఢిల్లీలో భారీ ఉగ్రదాడికి కుట్ర.. ఇద్దరు టెర్రరిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు!
- దేశరాజధానిలోని లక్ష్మీనగర్ లో ఘటన
- గణతంత్ర దినోత్సవం వేళ బీభత్సానికి కుట్ర
- భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేలుడు పదార్థాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగించేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ప్రణాళిక రచించారు. ఈ విషయాన్ని గుర్తించిన మిలటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈరోజు ఉదయాన్నే అబ్దుల్ లతీఫ్ ఘనీ, హిలాల్ అహ్మద్ భట్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని వీరి ఇంటి నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
లతీఫ్, భట్ ల స్వస్థలం జమ్మూకశ్మీర్ లోని బందిపొరా అని అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం వేళ ఢిల్లీలో బీభత్సం సృష్టించేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. వీరిద్దరూ ఢిల్లీలోని లక్ష్మీనగర్ లో నివాసం ఉంటున్నారని అన్నారు. వీరి సహచరులను పట్టుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారన్నారు.
ఢిల్లీలో దాడి కుట్రలో వీరిద్దరే ఉన్నారా? మిగతా నగరాల్లోనూ ఈ ఉగ్రసంస్థ దాడులకు కుట్ర పన్నిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. త్వరలోనే మరిన్ని విషయాలు చెబుతామన్నారు.