Republic Day: రేపు గణతంత్ర వేడుకలు.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు!
- వివరాలు ప్రకటించిన సీపీ అంజనీ కుమార్
- రేపు ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ ఆంక్షలు
- ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు హైదరాబాద్ లో ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ వేడుకల ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేపు పరేడ్ గ్రౌండ్ కు వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఉంటాయని అన్నారు. రేపు కంటోన్మెంట్ గార్డెన్ నుంచి ఎస్‌బీహెచ్ ఎక్స్ రోడ్ వరకూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకూ రోడ్డును మూసివేస్తారని తెలిపారు. అలాగే ఎస్‌పీ రోడ్డు నుంచి సెంట్రల్ టెలిగ్రాఫ్ క్రాస్ రోడ్డు, వైఎంసీఏ క్రాస్‌రోడ్ వరకూ వన్ వే ట్రాఫిక్ ను మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు.
ఈ వన్ వేలో పాసులు ఉన్నవారినే అనుమతిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. ఇక AA , A-1, B-1 కారు పాస్ కలిగి బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు రసూల్‌పూర జంక్షన్, ఫ్లై ఓవర్ మీదుగా, ట్యాంక్ బండ్ రాణిగంజ్ వైపు నుంచే వచ్చే వాహనాలు పార్కు లైన్, ఎంజీ రోడ్ మీదుగా, సెంట్రల్ టెలిగ్రాఫ్ ఐలాండ్ జంక్షన్ మీదుగా పరేడ్ గ్రౌండ్ కు చేరుకోవచ్చని అధికారులు అన్నారు.
AA కారు పాసులు ఉన్న వాహనాలను ఎస్ బీహెచ్ ఫ్లై ఓవర్ కింద ఉన్న వీఐపీ పార్కింగ్‌లో, A-1 వాహనాలను జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్ వద్ద.. B-1, బీ-2 పాసులున్న కార్లను ఛీప్ ఇంజినీర్ కార్యాలయం కాంపౌండ్ వద్ద, A-2 పాస్ వాహనాలను జింఖానా గ్రౌండ్స్ దగ్గర, కారు పాస్ లేని వారు ఆర్పీ రోడ్డు ద్వారా కుడివైపు వైఎంసీఏ జంక్షన్ వద్ద, పాస్ లేని వారు బైక్‍లను సిద్ధాంతి కాలేజీ లైన్, లంబా థియేటర్ వద్ద పార్కింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. అలాగే కంటోన్మెంట్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్లాజా ఎక్స్ రోడ్డు వద్ద ఎడమవైపు పార్కింగ్ ను కేటాయించారు.