Y S Jagan: జగన్‌పై దాడి కేసు చార్జిషీట్‌ను నేడు పరిశీలించనున్న ఎన్‌ఐఏ కోర్టు
- ఏ1గా శ్రీనివాస్‌ను పేర్కొన్న దర్యాప్తు సంస్థ
- మిగిలిన వివరాలు వెల్లడయ్యే అవకాశం
- కుట్ర కోణం ఉన్నదీ లేనిదీ తేలుతుంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో దాడిచేసిన సంఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జీషీట్‌ను నేడు ఎన్‌ఐఏ కోర్టు పరిశీలించనుంది. గత ఏడాది అక్టోబర్ 25వ తేదీన విశాఖ విమానాశ్రయంలో అక్కడి రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్‌పై కోడి కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కలకలానికి కారణమైన ఈ దాడి ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ ఇటీవల చార్జిషీట్‌ను కోర్టుకు అప్పగించింది. చార్జిషీట్‌లో ప్రత్యక్షంగా దాడికి పాల్పడిన శ్రీనివాస్‌ను ఎ1గా పేర్కొంది. కోర్టు పరిశీలన అనంతరం ఈ ఘటనలో కుట్రకోణం ఉందా?, నిందితులుగా మరెవరినైనా దర్యాప్తు సంస్థ పేర్కొందా? వంటి అంశాలు వెల్లడికానున్నాయి.