West Godavari District: ప్రజల బెంబేలు... భీమవరంలో జెయింట్ వీల్ ప్రమాదంలో యువకుడి మృతి, తణుకులో అదుపుతప్పిన డ్రాగన్!

  • ఒకే రోజు రెండు ప్రమాదాలు
  • 50 అడుగుల ఎత్తులో ఊడిపోయిన జెయింట్ వీల్ లింక్
  • ఓ యువకుడి పరిస్థితి విషమం
  • తణుకులో పట్టాలు తప్పిన డ్రాగన్ ట్రైన్

ఎగ్జిబిషన్... ఈ పేరు చెప్పగానే అందరిలో, ముఖ్యంగా చిన్నారుల్లో ఎంత ఆనందం కులుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ, ఇప్పుడు అవే ఎగ్జిబిషన్ లు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. టెర్రర్ ను ప్రత్యక్షంగా చూపుతున్నాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం మూలంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, భీమవరం పట్టణాల్లో ఏర్పాటు చేసిన ట్రేడ్ ఎగ్జిబిషన్లలో ఒకేరోజు రెండు ప్రమాదాలు జరగడం కలకలం రేపింది. భద్రతా ప్రమాణాలు పాటించని ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

భీమవరంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో సరదాగా జెయింట్ వీల్ ఎక్కిన ఓ యువకుడు ప్రాణాలను కోల్పోగా, మరో యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. జెయింట్ వీల్ లోని ఓ బాక్స్ దాదాపు 50 అడుగుల ఎత్తులో నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మరో యువకుడిని ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదే సమయంలో తణుకులో ఏర్పాటు చేసిన మాధురి ట్రేడ్ ఎగ్జిబిషన్ లో 'డ్రాగన్' రన్నింగ్ లో పట్టాలు తప్పి కింద పడింది. ఆ సమయంలో ట్రైన్ లో 40 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో డ్రాగన్ ట్రైన్ భూమికి తక్కువ ఎత్తులో ఉండటంతో స్వల్ప గాయాలు మినహా ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన ఎగ్జిబిషన్ నిర్వాహకులు, సందర్శకుల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణం కావడంతో ప్రదర్శనను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ఈ రెండు ఘటనలపైనా పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News