Krishna District: కృష్ణా జిల్లాలో హెడ్ మాస్టర్ పైశాచికత్వం.. ఎనిమిదేళ్ల చిన్నారికి రక్తస్రావం!

  • ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యంత దారుణం
  • హెడ్ మాస్టర్ దండించారని చెబుతున్న బాలిక
  • సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

తన మనవరాలి వయసున్న బాలికపై ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యంత దారుణంగా ప్రవర్తించిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. నూజివీడు డీఎస్పీ సీహెచ్జీవీ ప్రసాద్‌, ఆగిరిపల్లిలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఆగిరిపల్లిలోని పాఠశాలలో ఓ బాలిక రెండో తరగతి (8) చదువుతోంది. 22న స్కూలుకు వెళ్లిన ఆ పాప, సాయంత్రం 5 గంటలకు నడవలేని పరిస్థితిలో ఇంటికి వచ్చింది.

ఆమెకు రక్తస్రావం కావడాన్ని చూసి ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి డాక్టర్ నాలుగు కుట్లు వేయాల్సివచ్చింది. స్కూల్ హెడ్ మాస్టర్ గంపా వెంకటేశ్వరావు అలియాస్ వెంకట్రావు తనను దండించారని, అందువల్లే ఇలా అయిందని పాప చెప్పడంతో, తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటన ఆగిరిపల్లిలో తీవ్ర కలకలం సృష్టించడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తొలుత నూజివీడు ఆసుపత్రికి, ఆపై విజయవాడకు తరలించారు. బాలికకు గాయం ఎలా అయిందన్న విషయంపై దర్యాఫ్తు చేస్తున్నామని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్న కలెక్టర్‌ లక్ష్మీకాంతం, ఐసీడీఎస్‌, స్థానిక అధికారులను వివరాలు అడిగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తుండడంతో, చిన్నారిపై అత్యాచారం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది.

Krishna District
Second Class
Girl Child
Head Master
  • Loading...

More Telugu News