Karnataka: మహిళా ఎస్పీని మందలించిన మంత్రి.. కన్నీళ్లు పెట్టుకున్న పోలీసు అధికారిణి
- బ్లడీ రాస్కెల్ అంటూ ఎస్పీపై మండిపడిన మంత్రి
- కర్ణాటక సర్కారుపై బీజేపీ విమర్శలు
- అటువంటిదేమీ లేదన్న ఎస్పీ
కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సారా మహేశ్ ఓ మహిళా ఎస్పీపై వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. రెండు రోజుల క్రితం శివైక్యం చెందిన సిద్దగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన ఎస్పీ దివ్య గోపీనాథ్‌పై దురుసుగా ప్రవర్తించారు. తుముకూరులోని మఠంలోకి వెళ్తున్న మంత్రిని ఎస్పీ ఆపారు. దీంతో కోపోద్రిక్తుడైన మంత్రి ఆమెను తీవ్రంగా మందలించారు. ఎస్పీ తీరుతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన మంత్రి ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని సూచించినట్టు తెలుస్తోంది.
విషయం బయటకు రావడంతో మంత్రిపై బీజేపీ మండిపడింది. జేడీఎస్‌కు చెందిన మంత్రి మహేశ్ ఎస్పీని తీవ్రంగా దూషించడం వల్లే ఆమె కన్నీరు పెట్టుకున్నారని పేర్కొంది. ‘బ్లడీ రాస్కెల్’ అని ఆమెపై విరుచుకుపడడం వల్లే ఆమె కన్నీటి పర్యంతమయ్యారని ఆరోపించింది. పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోయినా విధులకు వచ్చిన ఎస్పీని ఇలా అవమానించడం సరికాదని పేర్కొంది. కాగా, తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ వచ్చిన వార్తలపై ఎస్పీ దివ్య స్పందించారు. అటువంటిదేమీ లేదని, తానేమీ బాధపడలేదని పేర్కొన్నారు. 12 లక్షల మంది హాజరైన కార్యక్రమంలో ఇటువంటి చిన్నచిన్న ఘటనలు మామూలేనని చెప్పుకొచ్చారు.