chanda kochhar: చందాకొచ్చర్ భర్త, వీడియోకాన్ అధినేతలపై సీబీఐ కేసు నమోదు
- 2012లో ఐసీఐసీఐ నుంచి రూ. 3,250 కోట్ల లోన్ తీసుకున్న వీడియోకాన్
- దీపక్ కొచ్చర్ సంస్థలో కోట్లాది రూపాయల పెట్టుబడులు
- గత అక్టోబర్ లో పదవి నుంచి తప్పుకున్న చందా కొచ్చర్
వేల కోట్ల లోన్ తీసుకున్న వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ దూత్ లపై సీబీఐ కేసు నమోదు చేసింది. అంతేకాదు ముంబై, ఔరంగాబాద్ లో ఉన్న వీడియోకాన్ ప్రధాన కార్యాలయాలలో సోదాలు నిర్వహించింది.
2012లో వీడియోకాన్ తీసుకున్న రూ. 3,250 కోట్ల లోన్ కు సంబంధించి అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో గత అక్టోబర్ లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి చందా కొచ్చర్ తప్పుకున్నారు. ఈ వ్యవహారంలో చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, ఆమె కుటుంబసభ్యులు భారీ ఎత్తున లాభపడ్డారనే వార్తలు గత ఏడాది సంచలనం రేకెత్తించాయి.
వీడియోకాన్ సంస్థకు లోన్ మంజూరైన నెలల వ్యవధిలోనే దీపక్ కొచ్చర్ స్థాపించిన న్యూపవర్ రెనెవబుల్స్ కంపెనీలో వేణుగోపాల్ దూత్ కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత... ఐసీఐసీఐ బ్యాంక్ తొలుత చందాకొచ్చర్ ను వెనకేసుకొచ్చింది. కొచ్చర్ పై సమగ్ర విచారణ జరిపిస్తామని బ్యాంకు బోర్డు ప్రకటించింది. అయితే కేసుకు సంబంధించి మరిన్ని ఆరోపణలు తెరపైకి రావడంతో... మల్టీ ఏజెన్సీ చేత విచారణ జరిపించారు. తాజాగా దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ దూత్ లపై సీబీఐ కేసు నమోదు చేసింది.