Nasir Ahmad Vani: సైనికుడిగా మారి భరతమాత కోసం ప్రాణాలర్పించిన మాజీ టెర్రరిస్టు... ప్రతిష్ఠాత్మక 'అశోక చక్ర'ను ప్రకటించిన కేంద్రం!
- 2004కు ముందు వరకూ ఉగ్రవాదిగా నాజిర్ అహ్మద్ వనీ
- ఆపై లొంగిపోయి ఉగ్రవాద నిర్మూలనకు కృషి
- కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి
నాజిర్ అహ్మద్ వనీ... కాశ్మీర్ లోయలో ఒకప్పుడు జవాన్లకు ముచ్చమటలు పట్టించిన ఉగ్రవాది. కానీ, ఆ తరువాత మారిపోయాడు. ఉగ్రవాదం కన్నా, భరతమాత సేవలోనే అధిక ఆనందం ఉందని, సైన్యంలో చేరాడు. లాన్స్ నాయక్ హోదాలో పనిచేస్తూ, ఉగ్రవాద నిర్మూలన కోసం తపించాడు. ఆ తపనలోనే ప్రాణాలు వదిలాడు. ఇద్దరు ఉగ్రవాదులను మట్టు బెట్టేందుకు వెళ్లి, వారి నుంచి తన సహచరులను రక్షించే క్రమంలో అమరుడయ్యాడు. అతని సేవలకు గుర్తుగా, సైనికులకు ఇచ్చే అవార్డుల్లో ప్రతిష్ఠాత్మకమైన అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. 26న జరిగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ఆయన కుటుంబీకులకు అవార్డును అందించనున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, 2004కు ముందు వరకూ ఉగ్రవాదిగా ఉన్న నాజిర్ అహ్మద్ వనీ, ఆపై లొంగిపోయి, కౌంటర్- ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ లో భాగమయ్యాడు. అతని నిబద్ధతను చూసిన ఉన్నతాధికారులు, ఆర్మీ 162వ బెటాలియన్ లో స్థానం కల్పించారు. కుల్గాంకు చెందిన వనీ, సైనికుడిగా రెండు సార్లు సేనా మెడల్ పురస్కారాన్ని అందుకోవడం గమనార్హం. ఆయనకు భార్య, 20, 18 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు.