Hyderabad: హైదరాబాద్‌లో మరో గొలుసుకట్టు మోసం...పల్లీ నూనె పేరుతో రూ.కోట్లకు టోకరా

  • రూ.2 లక్షల డిపాజిట్‌కు నెలకు రూ.20 వేల లాభం
  • సభ్యత్వం తీసుకున్నాక ఐదుగురిని చేర్పిస్తే అదనపు బహుమతులు
  • 6 వేల మంది నుంచి కోట్లు వసూలు చేసిన నిర్వాహకులు

హైదరాబాద్‌ లో మరో గొలుసుకట్టు మోసం బయటపడింది. పల్లీ నూనె తీసిస్తే డబ్బు ఇస్తామని, అవసరమైన మిషనరీ తామే సమకూర్చుతామని  చెప్పి కోట్లు దండుకుని చివరికి ముఖం చాటేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉప్పల్‌ కేంద్రంగా జరిగిన ఈ మోసంపై పోలీసులు తెలిపిన వివరాలివి.

 హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో 'గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌' పేరుతో ఓ కార్యాలయం ఏర్పడింది. ఏడాది క్రితం సికింద్రాబాద్‌లో ఉన్న కార్యాలయాన్ని ఇక్కడికి మార్చి పక్కనే గోదామును కూడా అద్దెకు తీసుకున్నారు. రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.20 వేలు సంపాదించుకునే అద్భుత అవకాశం అంటూ ప్రచారం మొదలుపెట్టారు.

పది శాతం లాభం అనగానే సహజంగానే చాలా మందిని ఈ ప్రకటన ఆకర్షించింది. ‘యంత్రాలు, పల్లీలు మేమే ఇస్తాం. నూనె (లీటరు రూ.35), పిప్పి (కేజీ రూ.20)  మేమేకొంటాం. మీరు చేయాల్సిందల్లా పల్లీ గింజల నుంచి నూనె తీయడమే’ అని చెప్పడం మరింత ఆకట్టుకుంది. ఉత్సాహం చూపిన వారి వద్ద నుంచి రూ.5 వేలు అడ్వాన్స్‌గా తీసుకుని బాండ్‌ పేపర్‌పై అగ్రిమెంట్‌ కూడా రాసివ్వడంతో చాలా మందికి గురికుదిరింది.

దీనికి అదనంగా మరో ఆకర్షణను కూడా మోసగాళ్లు బయటకు వదిలారు. రూ.5 వేలు చెల్లించి ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వారు మరో ఐదుగురిని చేర్పిస్తే బహుమతులు ఇస్తామని, ఎక్కువ మందిని చేర్పించిన వారికి కార్లు, బ్యాంకాక్‌ టూర్లు ఉంటాయని నమ్మబలికారు. రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయించిన వారికి వెంటనే రూ.5 వేలు నగదు ప్రోత్సాహకం అందించారు. ఇన్ని ఆకర్షణలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో సహజంగానే చాలామంది ఈ మోసగాళ్ల వలలో చిక్కారు.

రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దాదాపు 6 వేల మంది సభ్యులుగా చేరడంతో వీరి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. బాధితుల్లో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన ఇంద్రకిరణ్‌ (28) భార్య కూడా ఉన్నారు. ఈమె గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌ ఎండీ శ్రీకాంత్‌, మేనేజర్‌ భాస్కర్‌ యాదవ్‌ను కలవగా ఆమె నుంచి రూ.లక్ష తీసుకుని అగ్రిమెంట్‌ రాసిచ్చారు. నెలయ్యే సరికి ఇస్తామన్న డబ్బులు అడిగితే ఇవ్వలేదు. పలుమార్లు అడిగినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్తకు విషయం చెప్పడంతో ఇంద్రకిరణ్‌ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం బాగోతం బయటపడింది.

సంస్థ కార్యాలయంపై దాడిచేసిన పోలీసులు అక్కడి సిబ్బందిని అదుపులోకి తీసుకోగా నిర్వాహకుడు శ్రీకాంత్‌ పరారీలో ఉన్నాడు. గతంలో కూడా శ్రీకాంత్‌ ఇలాంటి గొలుసుకట్టు వ్యాపారాలు చేసి మోసం చేసినట్టు, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే అతనిపై పలు కేసులున్నట్టు బయటపడడంతో తమ డబ్బుకు కాళ్లు వచ్చినట్టేనని బాధితులంతా లబోదిబోమంటున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News