hardhik pandya: పాండ్యా, కేఎల్ రాహుల్ విషయంలో పరిస్థితి చేయి దాటిపోయింది.. నన్ను క్షమించండి: కరణ్ జొహార్
- పాండ్యా, రాహుల్ లను నా షోకు నేనే ఆహ్వానించా
- జరిగిన ఘటనతో నిద్రలేని రాత్రులను గడిపా
- నేను చెప్పే మాటను ఇప్పుడు ఎవరు వింటారు?
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ కార్యక్రమం... టీమిండియా యువ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లకు చిక్కులు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. కరణ్ జొహార్ కార్యక్రమం 'కాఫీ విత్ కరణ్'లో అమ్మాయిలపై క్రికెటర్లు ఇద్దరూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి వారు భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. బీసీసీఐ వీరిద్దరినీ సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. హార్దిక్ పాండ్యా అయితే కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై కరణ్ జొహార్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'నా షోకు పాండ్యా, రాహల్ లను నేను ఆహ్వానించాను. కాబట్టి నా కార్యక్రమానికి సంబంధించి నేనే బాధ్యత వహించాలి. జరిగిన ఘటనతో నేను ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను. నా వల్ల వీరికి తీరని నష్టం జరిగిందని బాధ పడ్డాను. ఇప్పుడు పరిస్థితి చేయి దాటి పోయింది. నేను చెప్పే మాటను ఎవరు వింటారు? నన్ను క్షమించండి' అంటూ తన బాధను వ్యక్తీకరించాడు.
మరోవైపు 'కాఫీ విత్ కరణ్' షో నిర్వాహకులు ఈ షోకు సంబంధించిన వీడియోలను వారి అఫీషియల్ వెబ్ సైట్ నుంచి తొలగించారు.