assemly: తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో రెండు నెలలపాటు ఆంక్షలు : సీపీ అంజనీకుమార్
- ఈనెల 23 నుంచి మార్చి 22వ తేదీ వరకు అమలు
- గుమిగూడి ఉండడం, నిరసనల వంటి కార్యక్రమాలు నిషేధం
- మారణాయుధాలతో తిరగడం నేరం
తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో రెండు నెలలపాటు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఆంక్షలు మార్చి 22వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆంక్షల్లో భాగంగా ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడి ఉండడం నిషేధమన్నారు. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టడం, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించడం చేయరాదని సూచించారు. కత్తులు, కర్రలు, బ్యాట్‌లు, తుపాకులు వంటి మారణాయుధాలతో తిరగడం నేరమని హెచ్చరించారు. అయితే పోలీసు బృందాలకు ఈ ఆంక్షలు వర్తించవని వివరించారు.