YSRCP: ఈ నెల 31న వైసీపీలో చేరుతా.. పదవులకు రాజీనామా చేయాలని జగన్ చెప్పారు!: మేడా మల్లికార్జున రెడ్డి

  • టీడీపీ అనే గంజాయి వనం నుంచి బయటపడ్డా
  • చంద్రబాబును నమ్ముకుంటే నాశనం అయిపోతారు
  • మీడియాతో మాట్లాడిన టీడీపీ బహిష్కృత నేత

తాను టీడీపీ అనే గంజాయి వనం నుంచి వైసీపీ అనే తులసి వనంలోకి వచ్చానని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఇప్పుడు తన ప్రాణం ప్రశాంతంగా, సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు. వైఎస్ మరణం తరువాత తాను టీడీపీలో చేరి ఎమ్మెల్యేను అయ్యానని చెప్పారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. తాను టీడీపీలో గత నాలుగున్నరేళ్లు నరకయాతన అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ ను లోటస్ పాండ్ లో కలుసుకున్న అనంతరం మేడా మీడియాతో మాట్లాడారు.

రాజంపేట నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతోనే తాను ఇన్నిరోజులు టీడీపీలో కొనసాగానని మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు.తన పదవీకాలంలో రాజంపేటలో రూ.800 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. వయసులో చిన్నవాడైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి జగనే సరైన వ్యక్తి అని మల్లికార్జున రెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే ఏ కుటుంబం చేయనట్లుగా వైఎస్, షర్మిల, జగన్ ప్రజల దగ్గరకు పాదయాత్ర చేస్తూ వెళ్లారని వ్యాఖ్యానించారు. అందుకే జగన్ నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధమైనట్లు చెప్పారు.

చంద్రబాబును నమ్మితే ప్రజలు ఇంకా అథ:పాతాళానికి పోతారనీ, నాశనం అయిపోతారని హెచ్చరించారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతారనీ, కానీ చెప్పిన ఒక్క పని కూడా చేయరని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. ఈ నెల 31న తాను కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరుతానని ప్రకటించారు.

టీడీపీ నుంచి పొందిన పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ సూచించారనీ, ఆ సూచనను పాటిస్తానని అన్నారు. జగన్ ను ఏపీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. టీడీపీ విప్, ఎమ్మెల్యే పదవికి ఈరోజే రాజీనామా చేస్తాననీ, రేపు వాటిని టీడీపీ ఆఫీసుతో పాటు స్పీకర్ కు పంపుతానని పేర్కొన్నారు. తాను జగన్ నే నమ్ముకున్నానని స్పష్టం చేశారు.

YSRCP
Jagan
Meda
mallikarjuna reddy
Kadapa District
rajampeta
resign
Telugudesam
  • Loading...

More Telugu News