Jammu And Kashmir: ఐపీఎస్ అధికారి తమ్ముడిని కాల్చి చంపిన భద్రతాబలగాలు
- షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్
- ముగ్గురు ఉగ్రవాదుల హతం
- మృతుల్లో ఒకరు ఐపీఎస్ అధికారి సోదరుడు
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఈరోజు భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. మృతుల్లో ఐపీఎస్ అధికారి ఇనాముల్ హక్ సోదరుడు షంసూల్ మెంగ్నూ కూడా ఉన్నాడని అధికారులు తెలిపారు. ఇనాముల్ హక్ 2012 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. షంసూల్ మెంగ్నూ ఉగ్రవాదుల్లో చేరక ముందు శ్రీనగర్ లో యునానీ మెడిసిన్ చదివాడు.
మరోవైపు ఉగ్రవాదుల నుంచి మూడు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ జవాను కూడా గాయపడ్డాడని... అతన్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతాదళాలను అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. ఈ నేపథ్యంలో వారిపై బాష్పవాయుగోళాలను, పెల్లెట్లను ప్రయోగించి చెదరగొట్టారు. ఈ ఎన్ కౌంటర్ లో రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు.