Andhra Pradesh: దావోస్ సదస్సులో ‘ఏపీ మెడ్ టెక్ స్టాల్’.. భారత్ కు గర్వకారణమన్న వీరేంద్ర సెహ్వాగ్!
- విశాఖలో మెడ్ టెక్ జోన్
- ప్రశంసలు కురిపించిన మాజీ క్రికెటర్
- 250 కంపెనీల సామర్థ్యంలో మెడ్ టెక్ జోన్
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఏపీ తరఫున స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు హాజరైన సంగతి తెలిసిందే. నేటి నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో దావోస్ లో ఏర్పాటు చేసిన ‘ఏపీ మెడ్ టెక్ జోన్’ స్టాల్ పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఏపీ ఏర్పాటు చేసిన మెడ్ టెక్ స్టాల్ మెరిసిపోతుందని వ్యాఖ్యానించాడు.
అత్యాధునిక మెడికల్ పరికరాల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘మెడ్ టెక్ జోన్’ అద్భుతమని కితాబిచ్చాడు. ఈ క్లస్టర్ జోన్ భారత్ కు గర్వకారణంగా మారబోతోందని వ్యాఖ్యానించాడు. ఈ స్టాల్ కు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో వీరూ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ కు డబ్ల్యూఈఎఫ్ వెబ్ సైట్ లింక్ ను జతచేశాడు. దాదాపు 250 మెడికల్ కంపెనీలు తమ ఉత్పత్తులను రూపొందించేందుకు ప్రత్యేకంగా మెడ్ టెక్ జోన్ ను ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.