evm: 2014లో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచింది.. భారత హ్యాకర్ సంచలన ఆరోపణలు!
- ఇందుకు రిలయన్స్ జియో సాయం చేసింది
- మిలటరీ గ్రేడ్ సిగ్నల్స్ వాడారు
- తన టీమ్ లో కొందరిని చంపేశారు
భారత ఎన్నికల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) భద్రమైనవి కావా? వీటిని సులభంగా హ్యాక్ చేసేయొచ్చా? అంటే ఓ భారతీయ హ్యాకర్ అవుననే జవాబు ఇస్తున్నాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచిందని భారత్ కు చెందిన సయిద్ షుజా అనే హ్యాకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు రిలయన్స్ జియో సంస్థ సహకరించిందని తెలిపారు. రిలయన్స్ సంస్థ అందించిన మాడ్యులేటర్ ద్వారా మిలటరీ గ్రేడ్ లో-ఫ్రీక్వెన్సీ తరంగాలను పంపించి ఈవీఎంలను హ్యాక్ చేశారని చెప్పారు.
భారత్ లో తన టీమ్ సభ్యుల్లో కొందరిని చంపేశారనీ, దీంతో తాను ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నట్లు షుజా తెలిపారు. లండన్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో స్కైప్ ద్వారా ఆయన పాల్గొన్నారు. హ్యాకింగ్ విషయం తెలుసుకున్నందుకు బీజేపీ నేత గోపీనాథ్ ముండేను ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే చంపేశారని బాంబు పేల్చారు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని విమర్శించారు. ఈ కేసును విచారించిన ఎన్ఐఏ అధికారి తంజీల్ అహ్మద్, హత్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
అయితే అంతలోనే తంజీల్ అహ్మద్ అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. తాను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 2009-14 మధ్యకాలంలో పనిచేశాననీ, తన టీమ్ డిజైన్ చేసిన ఈవీఎంలనే 2014 ఎన్నికల్లో వాడారని షుజా తెలిపారు. తన టీమ్ అడ్డుకోకుంటే 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు గతేడాది జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే గెలిచేదని వ్యాఖ్యానించారు. ఈ హ్యాకింగ్ లో బీజేపీతో పాటు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్ పార్టీలకు పాత్ర ఉందని మరో బాంబు పేల్చారు.
అయితే రిలయన్స్ జియో కంపెనీ 2014లో ఇంకా మొదలు కాకపోవడం గమనార్హం. మరోవైపు తన ఆరోపణలకు తగిన సాక్ష్యాలను కూడా షుజా మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. అయితే షుజా వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.