Wrong Call: పొరపాటున కాల్ చేసిన యువతిని వేధించుకుతిన్న బాలుడు... ఆటకట్టించిన రాచకొండ సైబర్ క్రైమ్!
- బాలుడి ఫోన్ కు గత నెలలో కాల్ చేసిన యువతి
- ఆపై అసభ్య చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులు
- అరెస్ట్ చేసి రిమాండుకు పంపిన పోలీసులు
పట్టుమని పద్దెనిమిదేళ్లు నిండని కుర్రాడు. అతని ఫోన్ కి తెలియని నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరో చూద్దామని తిరిగి ఫోన్ చేస్తే, అవతలి నుంచి ఓ యువతి మాట్లాడింది. తాను పొరపాటున కాల్ చేశానని, ఏమీ అనుకోవద్దని చెప్పి పెట్టేసింది. అంతటితో ఆ బాలుడు విషయాన్ని వదిలేయలేదు. అందుకే ఇప్పుడు కటకటాలపాలయ్యాడు.
రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా వెలిగోడు మండలం మోత్కూరుకు చెందిన ఓ బాలుడి (17) ఫోన్ కి గత సంవత్సరం డిసెంబరులో మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో అతను తిరిగి అదే నంబర్ కు ఫోన్ చేయగా, మాట్లాడిన యువతి, రాంగ్ డయల్ అయిందని చెప్పింది. ఆపై ఆ బాలుడి నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి.
పదేపదే ఫోన్ చేస్తుంటే, అతనితో మాట్లాడేందుకు ఆమె అంగీకరించలేదు. అయినా, పదేపదే ఫోన్ చేస్తుండగా, స్పందించడం మానేసింది. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకున్న బాలుడు, వాట్స్ యాప్ ద్వారా అసభ్యకరమైన చిత్రాలను, తన కోరిక తీర్చాలంటూ మెసేజ్ లు పెడుతూ వేధించుకు తింటున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసును విచారించిన పోలీసులు, బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.