O.panner selvam: యాగాలు చేస్తే ముఖ్యమంత్రి అయిపోతారా?: యాగం వార్తలపై స్పందించిన పన్నీర్ సెల్వం
- సచివాలయంలో పన్నీర్ పూజలు
- సీఎం కుర్చీకోసమేనన్న స్టాలిన్
- పన్నీర్‌ను సమర్థించిన రాష్ట్ర బీజేపీ చీఫ్
ముఖ్యమంత్రి పదవి కోసం సచివాలయంలో తాను యాగం చేయించినట్టు వచ్చిన వార్తలపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వివరణ ఇచ్చారు. సీఎం పదవి కోసం పన్నీర్ సెల్వం యాగం చేయించినట్టు డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వార్తలపై తీవ్ర దుమారం రేగడంతో పన్నీర్ సెల్వం స్పందించారు.
తన చాంబర్‌లో దేవుడికి పూజ చేశాను తప్పితే యాగం చేయలేదని స్పష్టం చేశారు. చాంబర్ మొత్తం చెదలు పట్టాయని, కిటికీ తలుపులు పాడవడంతో ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరూ చేసే పనులనే తాను కూడా చేశానని, అంతేతప్ప యాగం కాదని వివరణ ఇచ్చారు. సీఎం పదవి కోసమే తాను యాగం చేసినట్టు స్టాలిన్ ఆరోపించడం హాస్యాస్పదమని కొట్టిపడేశారు. ఎవరైనా యాగం చేస్తే సీఎం అయిపోతారా? అలా అని స్టాలిన్ నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు.
మరోవైపు, పన్నీర్ సెల్వం యాగం చేసినట్టు వస్తున్న వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. పన్నీర్ సెల్వాన్ని సమర్థించారు. యాగం చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. సచివాలయంలో యాగం చేస్తే సంప్రదాయాన్ని అతిక్రమించినట్టా? అని నిలదీశారు. అసెంబ్లీలో జయలలితపై దాడి చేయడం సంప్రదాయబద్ధమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నీర్‌కు మద్దతుగా బీజేపీ చీఫ్ మాట్లాడడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.