Dandupalyam-4: అత్యంత జుగుప్స, అభ్యంతరకర సన్నివేశాలు... 'దండుపాళ్యం-4'కు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ!

  • ప్రారంభం నుంచి చివరి వరకూ అవే సన్నివేశాలు
  • తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు
  • కేంద్ర సెన్సార్ బోర్డుకు నిర్మాత ఫిర్యాదు

బెంగళూరుకు దగ్గర్లో ఉండే దండుపాళ్యంకు చెందిన హైవే దోపిడీ దొంగల ముఠా కిరాతకాలకు దృశ్యరూపంగా తెరకెక్కిన నాలుగో భాగం 'దండుపాళ్యం-4'కు సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ సినిమా అత్యంత జుగుప్సాకరంగా, అభ్యంతరకరంగా ఉందని, ఈ సినిమాను ప్రజలు చూసేందుకు తాము అంగీకరించబోమని చెబుతూ, సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. మహిళా పాత్రధారుల వస్త్రధారణ, లైంగికంగా వేధించడం వంటి సన్నివేశాలు సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఉండటంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన బోర్డు సభ్యులు, సినిమాలో సందేశమే లేదన్న భావనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే, కోట్లు ఖర్చు పెట్టి తాము సినిమాను నిర్మిస్తే, రీషూట్ చేయాలనో లేదా కొన్ని సన్నివేశాలను తొలగించాలనో చెప్పకుండా ఇలా తిరస్కరించడం ఏంటని ప్రశ్నించిన నిర్మాత వెంకటేశ్, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలిని ఆశ్రయించడంతో పాటు కేంద్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. తన చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఆయన కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అసలు తమ సినిమాను చూడకుండానే వారు సర్టిఫికెట్ ను తిరస్కరించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఐదు భాషల్లో సినిమాను విడుదలకు సిద్ధం చేశామని, ఇలా అడ్డుకోవడం తగదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News