Chandrababu: రాష్ట్రానికి ఏం చేశారని కేంద్ర మంత్రులు వారానికి ఒకరు వస్తున్నారు : చంద్రబాబు
- రాష్ట్రపతి పాలన పెడతామంటే బెదిరిపోయేది లేదు
- అమరావతిలో కోల్‌కతాను మించిన సభ నిర్వహిస్తాం
- బీసీల్లో అపోహలు సృష్టించేందుకు వైసీపీ, టీఆర్‌ఎస్ యత్నం
రాష్ట్రానికి ఏం మేలు చేశామని వారానికి ఒక కేంద్ర మంత్రి ఏపీకి వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే చాలా తక్కువ నిధులు అందించారని ఆరోపించారు. మోదీ పాలనలో సంక్షేమం పడకేసిందని ధ్వజమెత్తారు. పార్టీ నేతలతో సోమవారం సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రపతి పాలన విధిస్తామని బెదిరిస్తే బెదిరిపోయే వారెవరూ ఇక్కడ లేరన్నారు. కోల్‌కతాలో విపక్షాలు నిర్వహించిన సభకు 10 లక్షల మంది వచ్చారని, అంతకంటే దీటైన సభ అమరావతిలో త్వరలో మనం నిర్వహిద్దామని చెప్పారు. బీసీల్లో అపోహలు సృష్టించేందుకు వైసీపీ, టీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మోదీ డైరెక్షన్‌లో పనిచేస్తున్న ఈ రెండు పార్టీలు టీడీపీకి బీసీలను దూరం చేయాలని చూస్తున్నాయన్నారు. ఇటువంటి కుట్రలను బీసీలే సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నాలుగు సీమ జిల్లాలకు కృష్ణా జలాలు ఇవ్వగలిగి రికార్డు సృష్టించామని గుర్తుచేశారు.