jagan: జగన్ సెమీ ఫైనల్ వరకు వచ్చి, ఫైనల్లో ఔటవుతాడు.. సెల్ఫ్ గోల్ చేసుకుంటాడు: బైరెడ్డి
- ఏపీలో కేసీఆర్ ను అసహ్యించుకోనివాడు లేడు
- అలాంటి కేసీఆర్ తో జగన్ చేతులు కలిపారు
- సెల్ఫ్ గోల్ చేసుకోవడం జగన్ కు అలవాటే
రాష్ట్రంలోని అధికారపక్షం, విపక్షం రెండూ రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నాయని కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీమలోని నాలుగు జిల్లాలను ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయని చెప్పారు. వీటిని పట్టించుకోని టీడీపీ, వైసీపీలు కేవలం పవర్ పాలిటిక్స్ పైనే దృష్టి సారించాయని విమర్శించారు. అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న తపన ఒకరిదైతే, అధికారంలోకి రావాలనే కోరిక మరొకరిదని అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ మైండ్ సెట్ ఏమిటో అర్థంకాదని బైరెడ్డి అన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో ఆయన ఇదే చేస్తుంటారని... సెమీఫైనల్స్ వరకు వస్తారని, ఫైనల్స్ లో ఔట్ అవుతారని చెప్పారు. సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారని అన్నారు. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం కూడా లేదని... ఇప్పుడు కూడా ఆయన అదే తప్పు చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఏపీలోని చిన్నపిల్లాడి నుంచి పెద్దల వరకు ఎవరిని అడిగినా... అసహ్యించుకోనివాడు ఎవరూ లేరని చెప్పారు. కేసీఆర్ ను తిట్టనివాడు ఏపీలో ఎవరూ లేరని అన్నారు. ఏపీకి అసలైన విలన్ కేసీఆరేనని... 10, 12 ఏళ్ల నుంచి నీచమైన భాషతో ఏపీని వేధిస్తున్నారని మండిపడ్డారు. సంస్కారం ఉన్న వారెవరూ కేసీఆర్ భాషను వాడరని... ఆయన తిట్టే తిట్లు ఏ డిక్షనరీలో ఉండవని అన్నారు. ఏపీలోని తెలుగువారి గురించి నీచంగా మాట్లాడుతూ, తెలంగాణలో సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలాంటి కేసీఆర్ తో జగన్ జతకట్టడమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ తో చేయికలిపితే వైసీపీకి ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు. జగన్ మరోసారి ఫైనల్స్ లో ఔటవుతారని అన్నారు.