Andhra Pradesh: మంత్రి ఆదినారాయణ రెడ్డి నన్ను కావాలని అవమానిస్తున్నారు!: రాజంపేట ఎమ్మెల్యే మేడా ఆవేదన

  • సమావేశాలకు పిలవకుండా అవమానిస్తున్నారు
  • చంద్రబాబుతో 22న సమావేశమై తేల్చుకుంటా
  • కడపలో మీడియా సమావేశంలో టీడీపీ నేత

టీడీపీకి తనను దూరం పెట్టేందుకే మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజంపేటలో అత్యవసర సమావేశం పెట్టారని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి విమర్శించారు. సొంత నియోజకవర్గంలో పార్టీ సమావేశాలకు పిలవకుండా మంత్రి తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను టీడీపీకి దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కడపలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాను టీడీపీని వీడి వైసీపీలో చేరబోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అకారణంగా తనపై అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22న పార్టీ అధినేత చంద్రబాబును కలుసుకుని తన బాధ చెప్పుకుంటానని స్పష్టం చేశారు. ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తేల్చిచెప్పారు. మేడా మల్లికార్జున రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల్లో నైతికస్థైర్యం నింపేందుకు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
meda
mallikarjun reddy
mla rajampeta
Kadapa District
YSRCP
  • Loading...

More Telugu News