Tamil Nadu: చంపుతానని బెదిరించిన అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన అత్త
- ఆరు నెలల క్రితం కుమార్తె ఆత్మహత్య
- అరెస్టయి జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చిన అల్లుడు
- మద్యం మత్తులో అత్త ఇంటికి వచ్చి హల్‌చల్ చేయడంతో ఘటన
ప్రాణం మీదికి వచ్చిందని భయపడిందో, కూతురి ఆత్మహత్య విషాదం వల్ల అల్లుడిపై ఆగ్రహం కట్టలు తెంచుకుందో.. కారణం ఏదైనా అల్లుడినే హతమార్చిందో అత్త. పెట్రోల్ పట్టుకుని వచ్చి తననే చంపాలని బెదిరిస్తున్న అతనిపై అదే పెట్రోల్ పోసి హత్య చేసింది.
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని నాగపట్నం సీర్కాళికి చెందిన గణేశన్ (36), సట్టనాదపురానికి చెందిన ఆండాళ్ కుమార్తె రమ్యకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం రమ్య ఆత్మహత్య చేసుకుంది. అల్లుడి కారణంగానే తన కూతురు చనిపోయిందని ఆండాళ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం గణేశన్‌ను అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన గణేశన్ తరచూ ఆండాళ్ ఇంటికి వెళ్లి గొడవ పడేవాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పూటుగా మద్యం సేవించి పెట్రోలు, కత్తి పట్టుకుని ఆండాళ్ ఇంటికి వచ్చాడు. ఆమెను, మనవరాలిని చంపుతానని బెదిరించాడు. ఈ గొడవలో భాగంగా గణేశన్ చేతిలోని పెట్రోల్ తీసుకున్న ఆండాళ్ దాన్ని అతనిపై పోసి నిప్పంటించింది. మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన గణేశన్ కేకలు వేయడంతో స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కొడుకు మృతిపై అనుమానం ఉందని గణేశన్ తండ్రి రాజేంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి విచారించారు. విచారణ సందర్భంగా తనను, మనవరాలిని చంపుతానని బెదిరించడంతో భయంతో తానే హత్యచేసినట్లు ఆండాళ్ అంగీకరించిందని పోలీసులు తెలిపారు.