Jagan: జగన్ కొత్త ఇంటిపై గగ్గోలు పెట్టేందుకు యెల్లో మీడియా సిద్ధమయిపోయింది!: విజయసాయిరెడ్డి విమర్శ
- ప్రజలకు అందుబాటులో ఉండేందుకే జగన్ ఇంటి నిర్మాణం
- ఎన్ఐఏ విచారణతో బాబు గుండెల్లో రైళ్లు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో జగన్ అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. కానీ జగన్ ఇంటిపై గగ్గోలు పెట్టేందుకు యెల్లో మీడియా సిద్ధమైపోయిందని విమర్శించారు. సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పటివరకు అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అడ్డంగా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్‌లో కట్టుకున్న ఇంద్ర భవనం గురించి ఎల్లో మీడియా పట్టించుకోదని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో స్పందించారు.
జగన్‌పై దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వీకరించినప్పటి నుంచి చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రాన్ని పాలించలేకపోతున్న చంద్రబాబు.. తాను స్వతంత్ర రాజ్యానికి చక్రవర్తిలా ఫీలవుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రజలు బాబును సాగనంపేందుకు పోలింగ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన మకాంను అమరావతికి సమీపంలోని తాడేపల్లికి మారుస్తున్నారు. ఫిబ్రవరి 14న జగన్ గృహప్రవేశం చేయనున్నారనీ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతారని వార్తలు వస్తున్నాయి.